అమెరికాకు ప్రధాని మోడీ.. ప్రపంచ దేశాల ఆసక్తి
X
ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరారు. రేపు తెల్లవారుజామున ఆయన అమెరికాలో ల్యాండ్ అవుతారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. మోడీ రెండో సారి ప్రధాని అయ్యాక అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై అమెరికా అధ్యక్షుడితో మోడీ చర్చిస్తారు. రక్షణ రంగంలో సహకారం, సాంకేతిక బదిలీకి సంబంధించి కీలక ఒప్పందాలు జరగనున్నాయి.
21న ఐక్యరాజ్యసమితిలో నిర్వహించనున్న యోగా డేలో ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 180 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. 22న అమెరికా కాంగ్రెస్లో ప్రధాని ప్రసంగిస్తారు. అదే రోజు ప్రెసిడెంట్ బైడెన్ దంపతులు వైట్ హౌస్లో మోడీకి స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా బైడెన్తో మోడీ కీలక చర్చలు జరపనున్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్-అమెరికా చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. ఈ పర్యటనలో ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండో ఫసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
23న అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మోడీకి విందు ఇవ్వనున్నారు. అదేవిధంగా వివిధ కంపెనీల సీఈవోలు, వ్యాపారస్తులతో మోడీ సమావేశమవుతారు. అదేరోజు వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆయన ఈజిప్ట్ పర్యటనకు వెళ్తారు. అక్కడ మోడీ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోడీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి.