జనసేన అధినేత పవన్‌పై పోసాని షాకింగ్ కామెంట్స్
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో ఒకరిపై మరొకరు మాటలతో విరుచుకుపడుతున్నారు. గెలుపు తమదేనంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలు ఒక్కటిగా మారి వైసీపీని ఢీకొనబోతున్నాయి. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు ఓట్లు టీడీపీకి వేయండని పవన్ అడగడంపై పోసాని ఫైర్ అయ్యారు.
అలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు కనీసం కాపు సోదరీమణుల కాళ్లైనా పట్టుకొని క్షమాపణ అడుగు అంటూ పవన్‌పై పోసాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్ ఏం తప్పు చేస్తున్నారో టీడీపీ, జనసేన నేతలు చెప్పాలంటూ సవాల్ విసిరారు. సీఎం జగన్ ఎవ్వరినీ విమర్శించలేదన్నారు. పవన్ క్షమించరాని తప్పులు చేస్తున్నారని, ఇప్పటికైనా కాపు కులానికి క్షమాపణ చెప్పాలని సూచించారు. వాలంటీర్లను అవమానించినందుకు, వాళ్లను మానవ అక్రమ రవాణాదారులుగా తప్పుడు ప్రచారం చేసినందుకు పవన్ సిగ్గుపడాలన్నారు.
హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదని, అది మోహన్ బాబుది అని పోసాని అన్నారు. కావాలంటే నార్కొటెక్ట్ చేయించాలని, ఒక వేళ తాను అబద్దం చెప్పినట్లు తేలితే చెప్పుతో కొట్టాలని పోసాని సవాల్ విసిరారు. సినీ నటి జయప్రదను టీడీపీలో అవమానించారని, ఆనాడు టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఏ మంచి పథకాన్ని కూడా చంద్రబాబు అధికారంలోకి రాగానే నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్నది వైసీపీ ప్రభుత్వమే అని, ప్రజలంతా జగనన్నకే అధికారాన్ని కట్టబెడతారని పోసాని కృష్ణమురళి అన్నారు.