గెలుపే లక్ష్యం.. ప్రశాంతో కిషోర్తో చంద్రబాబు మంతనాలు
X
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ పార్టీ ఇంచార్జులను మార్చడంతో పాటు పలువురు సిట్టింగులకు టికెట్లను ఇవ్వద్దనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ కూడాప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
చంద్రబాబు ప్రశాంత్ కిషోర్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పీకే ఇవాళ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి నారా లోకేశ్‌తో కలిసి వచ్చారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ భేటీలో టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. గతంలో పీకే వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు. జగన్ అధికారంలోకి రావడంలో పీకే పాత్ర కూడా ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది. టీడీపీకి పీకే వ్యూహకర్తగా పనిచేస్తారా లేక ఎన్నికలకు టైం తక్కువ ఉందని లైట్ తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.