కూతురి ప్రేమ పెళ్లిని దగ్గరుండి చేసిన వైసీపీ ఎమ్మెల్యే
X
ప్రేమ.. పిల్లల దగ్గర ఈ పదం వింటే తల్లిదండ్రులకు ఎక్కడా లేని కోపం వస్తుంది. పరువు, ప్రతిష్ట కోసం కూతుళ్లను చంపిన ఘటనలెన్నో ఉన్నాయి. కన్న కూతుళ్లనే కాదు ఆమె ప్రేమించిన యువకులను చంపిన ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన కూతురి ప్రేమ వివాహాన్ని ఆయనే దగ్గరుండి జరిపించారు. దీంతో ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తన కూతురికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. తన కూతురు పల్లవి.. పవన్ అనే యువకుడిని ప్రేమించింది.
వారి ప్రేమకు శివప్రసాద్ రెడ్డి సైతం ఒప్పుకున్నారు. బొల్లవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం చేశారు. అనంతరం ప్రొద్దుటూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు.
తన కూతురు ఇష్ణప్రకారం పెళ్లిచేశానని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. పేదవాడైన పవన్ను చదువుకున్న రోజుల్లోనే తన కూతురు ప్రేమించిందని చెప్పారు. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినట్లు వివరించారు. దీంతో ఆయన గొప్ప మనస్సుకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.