Home > ఆంధ్రప్రదేశ్ > ఇష్టంతో కాదు..అమ్మ కోసమే డ్యాన్స్ నేర్చుకున్నా..పల్సర్ బైక్ ఝాన్సీ

ఇష్టంతో కాదు..అమ్మ కోసమే డ్యాన్స్ నేర్చుకున్నా..పల్సర్ బైక్ ఝాన్సీ

ఇష్టంతో కాదు..అమ్మ కోసమే డ్యాన్స్ నేర్చుకున్నా..పల్సర్ బైక్ ఝాన్సీ
X

పల్సర్ బైక్ ఝాన్సీ ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. గాజువాక డిపోలో బస్సు కండక్టరుగా పనిచేసే ఝాన్సీ బుల్లితెరపైన పల్సర్ బైక్ పాటతో ఒవర్ నైట్‎లో స్టార్‎గా మారింది. అప్పటి వరకు పొట్టకూటికోసం స్టేజ్ పెర్ఫార్మెన్స్‎లు ఇచ్చిన ఝాన్సీ కెరీర్‎ను పల్సర్ బైక్ పాట ఓ మలుపు తిప్పేసింది. తన ఎనర్జిటిక్ డ్యాన్స్‎తో రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది ఝాన్సీ. ఓ వైపు కండక్టర్‎గా తన విధులను నిర్వర్తిస్తూనే మరోపైపు స్టేజ్ పెర్ఫార్మెన్సులు, టీ షోలల్లో డ్యాన్సులు చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్‎గా జీ తెలుగు నిర్వహించిన ‘సూపర్‌ క్వీన్‌-2’లో పార్టిసిపెంట్‎గా ఫైనల్ వరకు వెళ్లి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఝాన్సీ తాను డ్యాన్స్ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందో తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. అమ్మకు ఆసరాగా ఉండేందుకు ఎంచుకున్న డ్యాన్సే ఇప్పుడు తనను సెలబ్రిటీని చేసిందని తెలిపింది.

" ఇష్టంతో నేను డ్యాన్స్‌ నేర్చుకోలేదు. నా అవసరమే ఇటువైపు అడుగులు పడేలా చేసింది. నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడే అమ్మా నాన్న విడిపోయారు. మా అమ్మే మమ్మల్ని చూసుకునేది. అమ్మ కష్టం చూసి తట్టుకోలేకపోయాను. ఆమెకు ఆసరాగా ఉండాలనుకున్నాను. అందుకే ఈ ఫీల్డ్‌ ఎంచుకున్నాను. నా ఫస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‎కు రూ.150 ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. ఆ డబ్బు అమ్మకు ఇచ్చాను. అలా డ్యాన్స్ చేస్తూ సంపాదిస్తూ నా తమ్ముడిని చదివిస్తూనే నేనూ చదువుకున్నాను. నా మొదటి గురువు రమేశ్‌ నన్ను చాలా ప్రోత్సహించేవారు. ఆయన వల్లే నేను ‘తీన్‌ మార్‌ షో’ కు వెళ్లాను. అలా ఆ షోలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాను. నేను చేసేది మా రిలేటివ్స్‎కి నచ్చేది కాదు. నన్ను చాలా చీప్‎గా చూసేవారు. అయినా అవేమీ పట్టించుకోలేదు. నాది లవ్ మ్యారేజ్. ఇప్పటికీ నేను జాబ్ చేస్తూనే డ్యాన్స్‌ బ్యాలెన్స్‌ చేస్తున్నాను. ఇదంతా చేయగలిగానంటే నా భర్త ప్రోత్సాహం వల్లే. నన్ను మొదట్లో విమర్శించిన వాళ్లే ఇప్పుడు..‘నా మేనకోడలు, నా మరదలు అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు.

సూపర్‌ క్వీన్‌-2కు సెలెక్ట్ కావడమే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎలాగైనా విన్నర్ కావాలనుకున్నాను. కానీ ఫైనల్‌ ఎపిసోడ్‌లో స్ట్రెస్ కారణంగా దెబ్బతిన్నాను. గెలవకపోయినా పదిమంది మహిళలతో పోటీపడటం చాలా బాగా అనిపించింది. ఈ షో ద్వారా నేను ప్రేక్షకులకు వినోదం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాల్లో, సీరియల్స్‌లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా"అంటూ ఝానీ తన పర్సనల్ , ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంది.





Updated : 5 Aug 2023 6:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top