YCP MLA: 'జగన్ చెప్పిందే చేశా.. అయినా వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత'
X
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. సీఎం జగన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల్లో తనపై వ్యతిరేకత ఉందని ఓ సర్వే వెల్లడించిందన్న కారణంతో.. రాబోయే ఎన్నికల్లో సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. డబ్బులు తీసుకునే సర్వే జరిపే ఫేక్ సంస్థలు.. ఫేక్ సర్వేలనే ఇస్తాయని అన్నారు. సీఎం జగన్ చెప్పిన పనులన్నీ తాను చేశానని, అయినప్పటికీ ఆ పనుల వల్ల అసంతృప్తి ఉంటే అది తనవల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. తాను జగన్ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్ బాబు మీడియాకు తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు.
జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు. తిరుపతిచిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసీలను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని ఎమ్మల్యే బాబు ఫైర్ అయ్యారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎంఎస్ బాబు అన్నారు. తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాల్సిందేనని అన్నారు. అయితే తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనకు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. దళితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.