Tirumala : తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
X
తిరుమల(Tirumala)లో రథసప్తమి (Rathasapthami) మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం 5.30 గంటల నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. మలయ్యప్ప స్వామిగా శ్రీవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమాఢ వీధుల్లో ఆ కలియుగ పురుషున్ని దర్శించుకుని పునీతులవుతున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కాగా రాత్రి వరకు వాహనసేవలు కొనసాగనున్నాయి. 11-12 గంటల మధ్య చిన్నశేష వాహనం, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గరుడ వాహనం, 2-3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలను ఆలయ అర్చకులు జరపనున్నారు. వేడుకల నేపథ్యంలో మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. ఇందుకోసం ఏడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రత కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.