Liberation Congress Party: లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రిటైర్డ్ ఐఏఎస్
X
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలె సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ (LaxmiNarayana)సొంత పార్టీపెట్టారు. తాజాగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించినట్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ (Vijay Kumar ) ప్రకటించారు. బుధవారం గుంటూరు బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు విజయ్ కుమార్. అధిక జన మహా సంకల్పం పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభలో ‘లిబరేషన్ కాంగ్రెస్’ (Liberation Congress Party)పేరుతో నూతన పార్టీ పెడతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ వ్యవస్థకు కొత్త భాష్యం తీసుకొస్తానని చెప్పారు. పేదల కోసం సీఎం జగన్ యుద్ధం చేస్తానంటున్నారు. కానీ పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకు ఇచ్చి నిజాయతీ చాటుకోవాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దౌర్జన్యంగా లాక్కున్న భూములు, ఆస్తులు వారికి చెందేలా చట్టాన్ని మార్చారని ఆరోపించారు. సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని కోరారు. మైనారిటీలు, క్రిస్టియన్లపై జరుగుతున్న మారణకాండను పార్టీలు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. రాష్ట్రంలో సక్రమంగా వైద్యం అందడం లేదని.. ఆస్పత్రులకు వెళ్లలేక గిరిజన మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు చెప్పారు. త్వరలోనే వస్తుందని చెప్పారు.
విజయ్ కుమార్ గతంలో ఏపీ సీఎం జగన్ సర్కారులో కూడా కీలకంగా పనిచేశారు. అయితే విజయ్ పలుమార్లు జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. కాగా.. విజయ్ వైసీపీలో చేరడం లాంఛనమేనని అనుకుంటున్న సమయంలో అనుహ్యంగా ఆయన కొత్త పార్టీని తెరమీదకు తీసుకొచ్చారు. ఆయనను వైసీపీ తరఫున ఎంపీ బరిలోకి దింపాలని కూడా ఓ సందర్భంలో అనుకున్నారు. కానీ ఏమైందో ఆయన కొత్త పార్టీని పెట్టి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే వైసీపీ హై కమాండ్ ఆయన వెనుకలా ఉండి పార్టీ పెట్టించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.