ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 13 మంది గాయాలు
X
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. లింగంగుంట్ల బస్టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఘటనలో మరో 13 మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైనవారంతా వ్యవసాయ కూలీలు కావడం గమనార్హం. ప్రమాదంలో గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
పోలీసుల కథనం మేరకు..వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలంలోని అప్పాపురం గ్రామంలో మిర్చి కోత కోసం ఆటోలో వెళ్తున్నారు. అదే సమయంలో చిలకలూరిపేట వైపు బస్సు వెళ్తోంది. అయితే గణపవరం రోడ్డు నుంచి ఆటో ఒక్కసారిగా మెయిన్ రోడ్డుపైకి వచ్చేయడంతో దారుణం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ ఆ ఆటోను తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయ్యింది.
ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో హనుమాయమ్మ, శివపార్వతి, హజరత్ వలీ ఉన్నారు. గాయపడ్డ వారిలో శివకుమారి, కోటేశ్వరమ్మ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం వారిని వివిధ ఆస్పత్రులకు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడ్డవారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.