తిరుమలలో మొదలైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు
X
భక్తుల కొంగు బంగారం, కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణతో వైభవంగా మొదలైన వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రామకృష్ణ దీక్షితులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్దశేష వాహన సేవలో ఆయన పాల్గొంటారు. రద్దీ పెరగడంతో సిఫార్సు బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఉత్సవాల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగులు వేస్తున్నారు.ఈ ఏడాది అధిక మాసం రావడంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సోమవారం మొదట బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని, అనుచర దేవతలైన అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతులను ఊరేగిస్తారు.
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు..
తిరుమల పర్యటన సందర్భంగా సీఎం జగన్ పలు అభవృద్ధి పథకాలను ప్రారంభించారు. తిరుపతిలో రూ. 650 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కు రిబ్బన్ కత్తిరించారు. 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తిరుపతి గంగమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలో వకుళా మాత, రచన అతిథి గృహాలను ప్రారంభించారు.