వివేకా స్మారక సభలో షర్మిల షాకింగ్ కామెంట్స్ ..బంధువులే హంతకులు
X
వివేకా మరణం నమ్మలేని నిజమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఆఖరి సారి మా ఇంటికి వచ్చి కడప లోక్ సభకు పోటీ చేయాలని అడిగారు. 2 గంటలు ఒప్పించే ప్రయత్నం చేశారు. అన్నీ అనుకూలిస్తే చేస్తాలే అని చెప్పే వరుకు చిన్నాన్న వెళ్లలేదని షర్మిల వాపోయారు.బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని తెలిపారు. హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని చెప్పారు. హత్యకు గురైన చివరి క్షణం వరకు బాబాయ్ వైసీపీ కోసమే పని చేశారని అన్నారు. జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని చెప్పారు. సాక్షిలో పైన వైఎస్ ఫొటో ఉంటుందని... కింద వైఎస్ తమ్ముడి వ్యక్తిత్వ హననం ఉంటుందని మండిపడ్డారు. అద్దం ముందు నిలబడి మీ మనస్సాక్షి ఏం చెపుతోందో వినాలని షర్మిల అన్నారు. తన తోబుట్టువుల కోసం వైఎస్ ఏం చేశాడో మీకు తెలియదా? అని ప్రశ్నించారు.
వైఎస్ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరు ఏం చేశారని జగన్ ను నిలదీశారు. ఐదేళ్లయినా చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదని చెప్పారు. సునీత, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, కలిసి చదువుకున్నామని షర్మిల తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు తాను అండగా ఉంటానని చెప్పారు. రాజకీయాల కోసమో, అధికారం కోసమో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... వివేకా హంతకులకు శిక్ష పడాలని అన్నారు. చిన్నాన్న శరీరంపై ఎన్నో గొడ్డలి పోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని అన్నారు. బాబయ్ మరణంతో చిన్నమ్మ, సునీత అందరి కంటే ఎక్కువ నష్టపోయారని చెప్పారు. వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ నిర్వహించారు. ఈ సభకు ఏపీసీసీ చీఫ్ షర్మిల, వివేకా కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు, ఆత్మీయులు హాజరయ్యారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.