Ap Politics : వైసీపీకి షాక్..చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట
X
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో మార్పులు, చేర్పుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. కొందరు సిట్టింగ్‌లకు ఈసారి సీటు లేదని చెప్పడంతో ఆ పార్టీని వీడేందుకు పలువురు నేతలు సిద్దమవుతున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీలో పొలిటికల్ వార్ మొదలైంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కలవనున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమావేశం కానున్నట్లు ప్రచారం జోరందుకుంది. హైదరాబాద్‌లో చంద్రబాబుతో ఎంపీ మాగుంట భేటీ కానున్నట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మాగుంట సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించలేమని వైసీపీ అధిష్టానం స్పష్టం చేయడంతో ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
నేడు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన టీడీపీలో చేరికపై క్లారిటీ రానుంది. బాబుతో మాగుంట చర్చలు జరిపి, సీటుపై హామీ తదితర అంశాల గురించి మాట్లాడిన తర్వాత ఆయన రేపు ఒంగోలుకు వెళ్లి మీడియాతో మాట్లాడనున్నారు. టీడీపీలో చేరికపై ఆయన రేపు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆయన పార్టీ మారకుండా ఉండేందుకు వైసీపీ అధిష్టానం కూడా బుజ్జగింపు చర్యలు చేపడుతోంది. మొత్తానికి ఒంగోలు రాజకీయాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.