డాక్టర్లా మీరు..మహిళ చనిపోయినా బతికే ఉందంటూ ఎంత నాటకం
X
ఏ ప్రమాదం వచ్చినా, ఎంతటి అనారోగ్య సమస్య వేధించినా ఆ ప్రాణాలను రక్షించేది వైద్యులు. అందుకే వైద్యో నారాయణో హరి అని అంటారు పెద్దలు. దేవుడి తర్వాత అంతటి స్థానాన్ని వైద్యులకు ఇస్తుంటాం. అయితే కొందరు వైద్యుల తీరు వల్ల ఆ వైద్య వృత్తికే కలంకం తెచ్చే సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. వైద్య వృత్తి కమర్షియల్‌గా మారిన ఈ రోజుల్లో కొంతమంది డాక్టర్లు చేసే నిర్వాకాలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. సంతానం కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ చనిపోయినా వారి కుటుంబ సభ్యులకు తెలపకుండా 4 గంటల పాటు బతికే ఉందంటూ నమ్మబలికి పెద్ద నాటకమే ఆడారు అనంతపురం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు. దీంతో ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్‌బీ అనే మహిళకు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వన్నూరుస్వామితో వివాహమైంది. భర్త వన్నూరుస్వామి విధుల నిమిత్తం ఢిల్లీలో ఉంటున్నాడు. అయితే ఏడేళ్లైనా వీరిద్దరికి సంతానం కలగలేదు. దీంతో సంతానం కోసం అనంతపురంలోని ఓ ఆసుపత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆ డాక్టర్ ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చేస్తామని మోదీన్‌బీని నమ్మించింది. చికిత్సలో భాగంగా కొన్ని నెలలుగా ఆస్పత్రికి వస్తూ వెళ్తోంది మహిళ. మంగళవారం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో సర్జరీ కోసమని మోదీన్‌బీని వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆమెకు మెడిసిన్ ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే అది వికటించి చనిపోయింది. అయినా విషయం బయటికి రాకూడదని సుమారు 4 గంటల పాటు ఆమెను ఆపరేషన్ థియేటర్‌లోనే ఉంచారు. ఎవరికీ అనుమానం రాకూడదని ఫిట్స్ వచ్చిందని , సీరియస్‌గా ఉందని చెప్పుకొచ్చారు. ఆక్సిజన్‌ను కృత్రిమంగా పంపింగ్ చేస్తూ పల్స్ ఉన్నట్లు నమ్మించారు. ఇలా 4 గంటల పాటు థియేటర్‌లోనే చనిపోయిన పేషెంట్‌ను కళ్లముందు పెట్టుకుని నాటకం ఆడారు. రాత్రి 7:45 గంటలకు పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించి వారు రాగానే మరణించినట్లు ప్రకటించారు.
చనిపోయిన మహిళ గుత్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్ వన్నూరమ్మ మేనకోడలు కావడంతో బంధువులు ఆసుపత్రి చేరుకున్నారు. కోపంతో ఐసీయూ గదిని ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. అనస్థీషియా వైద్యుడిపై బంధువులు దాడికి ప్రయత్నించారు. మహిళకు వైద్యం అందించిన వైద్యురాలు దాడి జరుగుతుందని గుర్తించి లోపలే దాక్కుంది. ఆరోగ్యంగా ఉన్న తమ కూతురిని డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చి చంపేశారని మృతురాలి తల్లి అసాన్‌బీ రోదించింది. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.