తిరుమలలో షాకింగ్ ఘటన..5 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత
X
తిరుమల మెట్ల మార్గంలో ఓ చిరుతపులి శ్రీవారి భక్తులను భయబ్రాంతులకు గురిచేసింది. నడక మార్గంలోని 7వ మైలు దగ్గర చిరుత ఐదేళ్ల బాలుడిపై దాడి చేసింది. బాలుడి మెడ పట్టుకుని అడవిలోకి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ చిరుత అలజడిని సృష్టించింది. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో కర్నూలు జిల్లా ఆదోని నుంచి వచ్చిన ఐదేళ్ల కౌశిక్ తన తాతయ్యతో కలిసి స్నాక్స్ కోసం షాపు దగ్గరకు వచ్చాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడిపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న షాపు నిర్వాహకులు చిరుత వెంటే పరుగులు తీశారు. పెద్దగా అరుస్తూ దానిని వెంబడించడంతో బాలుడిని విడిచి చిరుత అడవిలోకి వెళ్లిపోయింది.
ప్రస్తుతం బాలుడు తిరుమల పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చిరుత దాడిలో బాలుడి శరీరానికి గాయాలయ్యాయి. కౌశిక్ చెవి వెనకాల, మరికొన్ని చోట్ల చిరుత పులి పంటి గాట్లు ఉన్నాయి. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఎలాంటి ప్రాణహానీ లేదని డాక్టర్లు చెబుతున్నారు. చిరుత దాడి విషయం తెలుసుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కౌశిక్ ను పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడని ప్రమాదమేమీ లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మెట్ల మార్గంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇకపై భక్తులు గుంపులు గుంపులుగా పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
తిరుమలలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. ఎక్కువగా చిరుత దాడులు రాత్రి వేళల్లో చోటు చేసుకుంటాయి. 2008లో తిరుమల నడక మార్గంలో ఓ చిరుతపులి ఇలాగే చిన్నారిపై దాడి చేసింది. దీంతో టీటీడీ భక్తుల రక్షణ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంది. వన్య ప్రాణులు సంచరించే ప్రదేశాల్లో జాలిని ఏర్పాటు చేసింది. అయితే, కొన్ని ఆలయాలు ఉన్న చోటుల్లో ఎలాంటి మెష్ లేదు. అలాంటి ప్రదేశాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈఓ. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.