స్కిల్ స్కాం అంతా ఉత్తిదే.. సీమెన్స్ మాజీ ఎండీ
X
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయన్నారు. స్కిల్ కేసుపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమేనని స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపాక కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లు ఉందని అన్నారు.
ఏపీలోని విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని సుమన్ బోస్ చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200 లకు పైగా ల్యాబ్ లను ప్రారంభించినట్లు తెలిపారు. 2021 వరకు 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పూర్తిచేసుకున్నారని.. వారిలో ఇప్పుడు చాలామంది మంచి ఉద్యోగాలు చేస్తున్నారని వివరించారు.
ఈ ప్రాజెక్టు ఉద్దేశం విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే తప్ప ఉత్పత్తులు తయారు చేయడం కాదని అన్నారు. ఒక్క శిక్షణ కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని ఎలా తేల్చేస్తారని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 271 కోట్లు చేతులు మారాయని సీఐడీ అభియోగాలు మోపింది. నిధుల మళ్లింపుపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అభ్యంతరం చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సీఐడీ తెలిపింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని.. ఇందులో రూ.271 కోట్లను షెల్ కంపెనీలకు దారి మళ్లించినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బాబుకు రిమాండ్ విధించింది.