Home > ఆంధ్రప్రదేశ్ > మర్చిపోలేని విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఆరుగురు

మర్చిపోలేని విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఆరుగురు

మర్చిపోలేని విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఆరుగురు
X

సెలవు రోజున సముద్ర తీరంలో సరదాగా గడపడానికి వచ్చిన ఆరుగురు యువత అనుకోని రీతిలో కెరటం బారినపడి సముద్రంలో మునిగిపోయారు. వారిలో ఒక యువకుడు కెరటానికి బలయ్యాడు. మరొకరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆదివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో సంభవించింది. విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం వుంటున్న బంధువుల కుటుంబాలకు చెందిన కట్టోజి సాయిరామ్‌ (పాత పోస్టాఫీసు), గన్నవరపు వెంకటసాయిప్రియాంక (సింహాచలం), కండిపల్లి సాయికిరణ్‌ (అల్లిపురం), కండిపల్లి ఫణీంద్ర (అల్లిపురం), జి.వి.ఎస్‌.రవిశంకర్‌ (సింహాచలం), కె.కావ్య (వన్‌ టౌన్‌), చైతన్య (వన్‌ టౌన్‌) ఆదివారం ఉదయం రాంబిల్లి మండలం సీతపాలెం సమీపంలోని బీచ్‌కు వచ్చారు. సముద్ర తీరంలో సరదాగా గడుపుతూ, నీటిలో ఉన్న రాళ్లపై నిల్చుని ఫొటోలు దిగడం మొదలు పెట్టారు

తీరానికి ఆనుకుని ఉన్న రాళ్లపై నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా పెద్దకెరటం వచ్చింది. దీంతో వీరందరూ సముద్రంలో పడి కొట్టుకుపోయారు. వెంటనే చుట్టుపక్కలున్న వారు గమనించి కేకలు వేశారు. దాంతో తీరంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై సాయి మినహా, మిగిలిన అయిదుగురిని బయటకు తీసుకురాగలిగారు. నీటమునిగిన వారిలో సాయిప్రియాంక ఉప్పునీరు తాగేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మిగిలిన నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన సాయి మృతదేహం కొంతసేపటి తరవాత అచ్యుతాపురం మండలం పూడిమడక తీరానికి కొట్టుకుకొచ్చింది. విశాఖ నుంచి కుటుంబ సభ్యులు వచ్చి కన్నీరుమున్నీరు అయ్యారు. సమాచారం అందడంతో రాంబిల్లి ఎస్సై డి.దీనబంధు, అచ్యుతాపురం ఎస్సై సన్యాసినాయుడు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. సాయి మృతదేహాన్ని అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇతను విశాఖలోని పాతపోస్టాఫీసు ప్రాంతంలో నివాసం వుంటున్న కట్టోజి రమేశ్‌ కుమారుడని, గీతం యూనివర్సిటీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడని ఎస్‌ఐ చెప్పారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. కోమాలోకి వెళ్లిన సాయి ప్రియాంకకు అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Updated : 21 Aug 2023 4:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top