Chandrababu : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. శుక్రవారానికి(13వ తేదీ) మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువురు న్యాయవాదులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను సాల్వే ప్రస్తావించారు. భోజన విరామం అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
ఇక, తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు. చంద్రబాబు పిటిషన్‌పై సోమవారం నాటి విచారణకు కొనసాగింపుగా ఈరోజు కూడా.. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రధానంగా మరోసారి పీసీ యాక్ట్‌లోని 17ఏ చుట్టే వాదనలు కొనసాగాయి. అయితే చంద్రబాబు పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది.