Skill Development Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు
X
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు ( Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు (Suprem Court) తీర్పు ఇవ్వనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేశారని, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం... తుది తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, ఎమ్ త్రివేది జనవరి 16న మధ్యాహ్నం 1 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023 సెప్టెంబర్ 22 నాటి ఆదేశానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును వెలువరించనున్నారు.
కేసు వివరాలివే..
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది.
ఈ కుంభకోణం కేసులోనే గతేడాది సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అ వినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో క్వాష్ పిటిషన్‌ను వేశారు. అంతకుముందు(గతేడాది సెప్టెంబరు 22న) ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించిందని చంద్రబాబు తన పిటిషన్‌లో వాదించారు. SLPLని త్వరగా విచారణకు స్వీకరించాలని సెప్టెంబరు 25న ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థలూథ్రా సీజేఐ ధర్మాసనం ముందుకు వెళ్లారు. ఈ కేసు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించింది. జస్టిస్ అనిరుద్ధబోస్ ఈ తీర్పును వెలువరించనున్నట్లు సమాచారం. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చిన తీర్పు...ఎట్టకేలకు మంగళవారం వెలువడనుంది. కాగా ఈ కేసులో 52రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన చంద్రబాబును అక్టోబర్ 31న(2023) తాత్కాలిక బెయిల్‌పై రిలీజ్ చేయగా.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజురైంది.