గజేంద్రమోక్ష అవతారంలో దర్శనమిచ్చిన శ్రీవారు
X
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం సర్వభూపాల వాహనంపై ఊరేగారు. తిరుమాడ వీధుల్లో గజేంద్రమోక్ష అలంకారంలో ఊరేగుతూ శ్రీ మలయప్పస్వామి భక్తులను కటాక్షించారు. సర్వభూపాల వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది.
ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 19 గురువారం రోజున గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. గరుడ సేవకు భారీగా భక్తులు తరిలివచ్చే అవకాశముండటంతో టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. భక్తులందరికీ శ్రీవారి మూలమూర్తి, వాహనసేవ దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గ్యాలరీలు నిండిపోయినట్లైతే.. మాడవీధుల్లోని ప్రత్యేక క్యూలైన్లలో నిలబడి భక్తులు గరుడ వాహన సేవను వీక్షించేందుకు అవకాశం కల్పించనున్నారు.