Supreme Court : సీఎం జగన్కు సుప్రీం కోర్టు నోటీసులు.. సీబీఐపై సీరియస్
X
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, సీబీఐకి సుప్రీం కోర్ట్ నోటీసులు ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం చేస్తుందో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. రఘురామకృష్ణరాజు వేసిన కేసుల పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా పదేళ్లుగా జగన్ అక్రమాస్తుల కేసు నత్తనడకన సాగుతున్న క్రమంలో.. విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనికోరుతూ రఘురామకృష్ణ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.
‘అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3041 సార్లు వాయిదా పడ్డాయి. ఈ కేసు విచారణ జరిపి నిందితులకు త్వరగా శిక్ష పడే ఆలోచణలో సీబీఐ ఉన్నట్లు లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ కు ఇష్టారీతిన వాయిదాలు కోరే స్వేచ్చనిచ్చారు. దీనివల్ల కేసు విచారణ ఇంతకాలం ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే.. విచారణ మొదలయ్యే అవకాశం కనిపించట్లేదు. అందుకే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల’ని రఘురామకృష్ణ పిటిషన్ లో చెప్పుకొచ్చారు.