Home > ఆంధ్రప్రదేశ్ > ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
X

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు మే 31న మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అవినాష్‌కు నోటీసులు ఇచ్చింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డివై చంద్ర‌చూడ్ ధ‌ర్మాస‌నం ముందు కేసును విచారించాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది.

కాగా... గత మంగళవారం అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ముందు విచారణకు వచ్చింది. అయితే తమ ముందున్న కేసుల్లో సీనియర్‌ న్యాయవాదులు వాదించడానికి ధర్మాసనం అనుమతించలేదు. దాంతో సునీతారెడ్డే స్వయంగా వాదనలు వినిపించారు. ఆమెకు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సహకరించడానికి ధర్మాసనం అనుమతించింది. తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి దర్యాప్తుకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సునీత తెలిపారు. అందుచేత ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. అయితే వేరే ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్న వెకేషన్‌ బెంచ్‌, తదుపరి విచారణను నేటి(జూన్ 19)కి వాయిదా వేసింది.



Updated : 19 Jun 2023 12:32 PM IST
Tags:    
Next Story
Share it
Top