TDP MLAs : ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
X
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసనలతో హోరెత్తించారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు.
నిత్యావసర సరుకుల ధరలపై తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టుగా ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు.
అదే సమయంలో సంతాప తీర్మానాలను కూడ ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతి ఇచ్చారు.ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరిలు ప్రసంగించారు. అయితే అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్ వైపునకు విసిరివేశారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శాసనసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అసెంబ్లీని టీ బ్రేక్ కోసం స్పీకర్ వాయిదా వేశారు. టీ బ్రేక్ తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు.అసెంబ్లీలో ఈలలు వేశారు టీడీపీ సభ్యులు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈలలు వేయవద్దని స్పీకర్ టీడీపీ సభ్యులను వారించారు. సభా సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారని స్పీకర్ టీడీపీ సభ్యుల దృష్టికి తీసుకు వచ్చారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని అధికార పార్టీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.