ఎస్వీ యూనివర్సిటీలో చిరుత.. భయంతో విద్యార్ధుల పరుగులు
X
తిరుమలలో చిరుత భయం వీడకముందే తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేగింది. ఇంజినీరింగ్ కాలేజీలో చిరుత కన్పించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వర్సిటీ సిబ్బంది అటవీశాఖకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలిని పరిశీలించారు. అలిపిరి, ఎస్వీ యూనివర్శిటీ, జూపార్క్ రోడ్డు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎస్వీ యూనివర్సిటీలో గతంలోనూ చిరుతలు కనిపించాయి.
మరోవైపు తిరుమలలో చిరుత పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తిరుమలలో 5 చిరుతలలు సంచరిస్తున్నట్లు సమాచారం. నిన్న ఒక చిరుతను బంధించిన అధికారులు.. మిగితాటి కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల భద్రతపై టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నడకదారిలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు. మధ్యాహ్నం రెండు గంటల తరువాత పిల్లలను అనుమతించమన్నారు. భక్తుల భద్రత కోసం ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తామని చెప్పారు.
కాగా తిరుమలలో చిరు దాడిలో లక్షిణ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం సాయంత్రం నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. చిరుత దాడి చేయడంతోనే చిన్నారి మృతిచెందినట్లు తెలుస్తోంది.