Home > ఆంధ్రప్రదేశ్ > దంచికొడుతున్న వానలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్

దంచికొడుతున్న వానలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్

దంచికొడుతున్న వానలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్
X

ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని విల్లుపురం, అరియలూరు, కడలూరు, నాగపట్టణం, పుదుచ్చేరి, కరైకల్ జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆయా జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. ఇక చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, చుద్దలోర్‌ జిల్లాల్లో, పుదుచ్చేరిలో మంళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎగువ వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, తమిళనాడులో తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఈశాన్య రుతుపవనాలే కీలకం. గతవారం వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది.


కాగా.. తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. కాగా.. గత వారం కూడా తమిళనాడులో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం కావడంతో పాఠశాలను మూసివేశారు.

Updated : 14 Nov 2023 5:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top