Minister Party Office : ఏపీ మంత్రి విడుదల రజిని కార్యాలయంపై రాళ్ల దాడి..
X
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో విద్యానగర్‌లోని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని నూతన పార్టీ ఆఫీస్‌పై టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. గుంపును చెదరగొట్టారు. కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి విడుదల రజిని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఉంది. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా మంత్రి విడదల రజిని నియమితులయ్యారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మంత్రి విడుదల రజిని కార్యాలయం పక్కనే అర్ధరాత్రి దాటాక టీడీపీ, జనసేన శ్రేణులు నూతన సంవత్సర ర్యాలీ తీశారు. కార్యాలయం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
పాలాభిషేకం అనంతరం టీడీపీ, జనసేన కార్యకర్తల గుంపులోని కొందరు మంత్రి విడదల రజిని నూతన కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. దాంతో కార్యాలయ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్లేక్సీలు తగలబెట్టారు. ఓపెనింగ్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులను లాఠీ ఛార్జ్ చేసి చదరగొట్టారు. కొంతమంది టీడీపీ, జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మంత్రి కార్యాలయం వద్దకు వచ్చి పరిశీలించారు.