జగన్ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకట్రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసినా చేయొచ్చని చెప్పారు. లేదా తనపై దాడి జరిగే అవకాశముందని అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ విధ్వంస పాలనను ప్రజలంతా చూస్తూనే ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసి ఆ తప్పులన్నింటినీ తనపై వేసే ప్రయత్నం చేస్తోందని బాబు మండిపడ్డారు. 45ఏండ్లుగా ఎవరూ తనపై కేసు పెట్టే ధైర్యం చేయలేదని, ఒక్క సాక్ష్యాధారం కూడా దొరకనందునే ఎలాంటి కేసులు పెట్టలేకపోయారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై 26 ఎంక్వైరీలు వేశారని, అవన్నీ ఏమైపోయాయని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.
జగన్ సైకో సీఎం మాత్రమే కాదు కరుడుగట్టిన సైకో అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులకు కూడా చెప్పకుండా వారి భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పులను ప్రశ్నిస్తే వారిని అడ్డుకునే పరిస్థితి నెలకొందని, ఇసుక అక్రమాలపై NGTలో కేసులు వేసిన నాగేంద్రను వేధిస్తున్నారని అన్నారు. ముఖాముఖిలో భాగంగా పలువురు తమ సమస్యల్ని చంద్రబాబు దృష్టికి తీసుకురాగా అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
రేపో, ఎల్లుండో నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు - చంద్రబాబు నాయుడు pic.twitter.com/ToVzfeEtRJ
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2023