'మీ ఇంట్లో మేం చిచ్చు పెట్టడం ఏంటి?'.. జగన్‌కు చంద్రబాబు కౌంటర్
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. తనపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో మీరు చిచ్చుపెట్టుకుని మాపై పడతారేంటి? అది మీ కుటుంబ వ్యవహారం. మాకేం సంబంధం? మీ తల్లి, మీ చెల్లి.. మీరు చూసుకోవాలి. ఏదో ఒకలా వేరేవాళ్లపై బురద చల్లడం రాజకీయం కాదు’ అని మండిపడ్డారు. ‘మీ ఇంట్లో మేం చిచ్చు పెట్టడం ఏంటి? జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్‌లో తిరుగుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. పింఛన్ల పెంపు కోసం పెట్టిన కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం సబబేనా? అంటూ ప్రశ్నించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సర్పంచుల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జగన్ కుటుంబ వ్యవహారాలు మాట్లాడేవాడిని కాను. పింఛను పెంచామన్న కార్యక్రమంలో రాజకీయ పార్టీలను ముఖ్యమంత్రి విమర్శించడంతో నేను మాట్లాడాల్సి వస్తోంది’ అని చంద్రబాబు అన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఈ రోజు కాకినాడ సభలో మాట్లాడుతూ.. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అవి కుటుంబాలను చీలుస్తాయని, రాజకీయాలు చేస్తాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో కుటుంబాలను మరింత చీల్చే కార్యక్రమాలు జరుగుతాయని, కుట్రలు, కుతంత్రాలు పెరుగుతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు ధీటుగా రిప్లై ఇచ్చారు. వైఎస్ జగన్ చెల్లికి, తల్లికి ఆయనకు దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. దీంతో కాంగ్రెస్ తెలంగాణలో వలే వేగంగా పుంజుకునే అవకాశాలు లేకపోలేవు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ వైసీపీపైనే పెద్ద దెబ్బ కొట్టే ముప్పు ఉన్నది. ఇది పరోక్షంగా టీడీపీ, జనసేన కూటమికి కలిసి వచ్చే అంశం. అంటే.. చెల్లి నిర్ణయాలతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయి.