CBN Remand Extended :స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ పొడగింపు
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్ పొడగించింది. అక్టోబర్ 5 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. మరోవైపు సీఐడీ కస్టడీ గడువు సైతం సాయంత్రం 5గంటలతో పూర్తైంది. దీంతో సీఐడీ అధికారులు ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ తో పాటు కస్టడీని పొడగించాలని కోరారు. అయితే ఏసీబీ వాదనను చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకు ముందు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని కోర్టు ఉత్తర్వుల మేరకు రెండ్రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించారు. రెండో రోజు ఆదివారం సైతం దాదాపు 6 గంటలకుపైగా ఆయనను ప్రశ్నించారు. సీఐడీ అధికారులు శని, ఆదివారాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపారు. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున బ్రేక్ ఇచ్చిన అధికారులు విచారణ ప్రక్రియ అంతటిని వీడియో తీయించారు. రెండు రోజుల కస్టడీలో సీఐడీ 100కు పైగా ప్రశ్నలు అడగగా.. చంద్రబాబు వాటిలో కొన్నింటికి సమాధానం చెప్పలేదని సమాచారం. విచారణ పూర్తైన అనంతరం డాక్టర్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.