చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన వెనక చాణక్యుడికే దిమ్మతిరిగే వ్యూహం.. ట్రాప్‌లో పడిపోయిన జగన్!
X
ఏమైనా చేయి, వార్తల్లో ఉండు! ఇదీ సగటు భారతీయ రాజకీయ నేత వ్యూహం. నిత్యం వార్తల్లో ఉండకపోతే జనం మర్చిపోతారు. వాళ్లకసే షార్ట్ మెమరీ. నిరుద్యోగం, పేదరికం, టమాటా ధరలు వంటి నానా సమస్యలతో అల్లాడిపోయే ప్రజలకు ఫలానా రాజకీయ నాయకుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని ఆలోచించే తీరిక ఉండదు. అందుకే నేతలు ప్రజలపై దయదలచి వారి దగ్గరికే వెళ్లడానికి యాత్రలు చేపడుతుంటారు. దానికి ప్రజాసంక్షేమం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం అనే గోల్డ్ కవరింగ్ కటింగ్ షరా మామూలే. అధికారంలోకి రావడమే అంతిమ లక్ష్యం. అడ్వానీ రథయాత్ర అయినా, వైఎస్ వంశీయుల యాత్రలైనా, చంద్రబాబు, ఆయన కొడుకు యాత్రలైనా.. ఏదీ దీనికి మినహాయింపు కాదు. ‘చేతనైతే యాత్ర చేయ్, లేకపోతే విజిట్ చెయ్, వీలైతే పొద్దున టిఫిక్ కుమ్మి ఆమరణ దీక్షకు దిగి స్టంట్ చేసేయ్’ అనేదే వ్యూహం. ప్రాజెక్టుల సందర్శనలు కూడా అందులో భాగం.
తాజాగా టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీడీపీ రాజకీయ చరిత్రలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. 2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు సందర్శన తెలుగు రాజకీయాల్లో హైలెట్. ఇప్పుడు దాన్ని మించిన దృశ్యాలు ఏపీలో కనబడుతున్నాయి. బాబు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టడంతో రాయలసీమలో సంకుల రక్తపాత సమరం సాగుతోంది. ప్రాజెక్టుల్లో జగన్ ప్రభుత్వం అవినీతిని, నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి బాబు ఈ యాత్ర చేపట్టారు. దొంగాదొంగా అంటే భుజాలు తడుముకున్నట్లు వైసీపీ శ్రేణులు అత్యుత్సాహంతో బాబును అడ్డుకుని ఆయనకు మరింత మైలేజ్ పెంచుతున్నాయి. కాగల కార్యం వైసీపీ వాళ్లే తీరుస్తున్నారని బాబు గుంభనంగా నవ్వుకుంటున్నారు!!
సీమ నుంచే మొదలు పెట్టడం వెనక
బాబు జలాశయాల పర్యటన రాయలసీమ నుంచే మొదలైంది. పెన్నా టు వంశధార విజిటింగ్ భాగంగా ఆయన గండికోట, చిత్రావతి రిజర్వాయర్లను చూశారు. జగన్‌మోహన్‌రెడ్డి అడ్డా పులివెందులలో ఊహించినట్లే నిరసనలు ఎదురయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్న కనీస జ్ఞానం, సహనం లేని వైసీపీ శ్రేణులు బాబు వెళ్లిన చోటల్లా నిరసనకు దిగి రణరంగం సృష్టిస్తూ ఆయన కోరికను నెరవేరుస్తున్నాయి. నిజానికి నిరసనలు లేకపోతే బాబు పర్యటనలు లోకేశ్ యాత్రలా ఓ చిన్నవార్తగా మిగిలిపోయేవే. వైసీపీ బెదిరింపులు, దాడులు, ఫ్లెక్సీల చించివేతల వల్ల అసహనం, భయం వ్యక్తమవుతాయే తప్ప సాధించేదేం ఉండదు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పడు అధికారంలో ఉన్న చంద్రబాబు చూసీచూడనట్టు పోయాడే తప్ప రచ్చకెక్కలేదు. అధికారంలోకి వచ్చిన జగన్ అందుకు విరుద్ధంగా బాబు, ఆయన కొడుకు లోకేశ్‌ల యాత్రలను అడ్డుకుంటున్నాయి. వీటివల్ల ఎవరికి లాభమన్న సంగతి ప్రక్కన పెడితే ప్రజాస్వామ్యం కనీస విలువలు మృగ్యమయ్యాయన్నది తేటతెల్లం.
ఇప్పుడే చాన్స్..
ఎన్నికలు ఏడాది కూడా వ్యవధిలేని నేపథ్యంలో చంద్రబాబు పెద్ద ప్రణాళికతోనే ఊళ్లు పట్టారు. 73 ఏళ్ల వయసులో ఆయన పాదయాత్ర చేసే పరిస్థితి లేదు. లోకేశ్ యాత్ర చేస్తున్నా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. యాత్ర రూట్లో పచ్చ శ్రేణులు కూడా నిరాసక్తంగా పాల్గొంటున్నాయి తప్ప జోష్ లేదు. ఇలాగైతే కష్టమని భావించిన మాజీ సీఎం తన వంతు సాయంగా అబ్బాయికి ఊపివ్వడానికి నీటిగుంటల బాటల పట్టారు. 10 రోజుల రాష్ట్రవ్యాప్త సందర్శనల వల్ల శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, జగన్ ప్రభుత్వంపై దాడి చేయాలన్నది ఆయన లక్ష్యం. ప్రాజెక్టుల్లో అవినీతిని బయటపెట్టడానికంటే పార్టీ కార్యకర్తను ఉత్సాహపరిస్తూ వైసీపీని రెచ్చగొట్టి, అల్లర్ల కారణంగా సానుభూతి సంపాదించాలని పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగారు. బాబు ప్రజల్లోకి వెళ్తే తమకు మైనస్ అవుతుందని వైసీపీ భుజాలు తడుముకుని ఉచ్చులో పడిపోయి యాగీ చేస్తూ ప్రజలకు ఉచిత వినోదాన్ని పంచుతోంది.