ఖైదీ నంబర్ 7691.. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతి..
X
టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈ నెల 22వరకు ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జైలులో బాబును స్నేహ బ్లాక్లో ఉంచిన అధికారులు.. ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు.
మరోవైపు బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తీర్పు వెలువడగానే వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.
అదేవిధంగా హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. అటు సీఐడీ సైతం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబును 10రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం బాబు బెయిల్పై ఉత్కంఠ నెలకొంది.
అంతకుముందు భారీ భద్రత నడుమ పోలీసులు బాబును జైలుకు తరలించారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగానే పోలీసులు రోడ్డు క్లియరెన్స్ చేశారు. విజయవాడ నుంచి ఆదివారం రాత్రి 10 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరింది. అర్థరాత్రి ఒంటిగంటకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. బాబు వెంటన ఆయన తనయుడు నారా లోకేష్ జైలు వరకు వెళ్లారు.