చంద్రబాబుకు రాత్రి జాగారమే.. రేపే పెళ్లి రోజు..
X
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సిట్ విచారిస్తోంది. ఇవాళ ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసిన సిట్.. సాయంత్రం 5గంటలకు కుంచనపల్లిలోని సిట్ ఆఫీసుకు తీసుకొచ్చింది. అప్పటినుంచి బాబును అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ముందు అధికారులు 20ప్రశ్నలు ఉంచినట్లు తెలుస్తోంది. సాయంత్రమే ఏసీబీ కోర్టులో చంద్రబాబును సిట్ హాజరుపరుస్తుందని ముందుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టలేదు.
ఈ క్రమంలో అధికారులు ప్లాన్ మార్చినట్లు సమాచారం. రేపు తెల్లవారుజామున 5 గంటలకు చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చంద్రబాబును ఇవాళ ఉదయం 6గంటలకు అరెస్ట్ చేసిన సిట్కు కోర్టులో హాజరుపరిచేందుకు రేపు ఉదయం 6గంటల వరకు టైం ఉంది. దీంతో అధికారులు ఉదయం వరకు బాబును విచారించే అవకాశం ఉంది. అధికారుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
మరోవైపు ఆదివారం చంద్రబాబు - భువనేశ్వరిల పెళ్లి రోజు. 1981 సెప్టెంబర్ 10న వీరి వివాహం జరిగింది. పెళ్లి జరిగే నాటికే చంద్రబాబు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా చంద్రబాబును కలిసేందుకు ఆయన తరఫు లాయర్లు ప్రయత్నించినా, సిట్ కార్యాలయంలోకి వారిని మొదట అధికారులు అనుమతించ లేదు. దీంతో సిట్ అధికారుల తీరుపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరువాత దమ్మాలపాటి శ్రీనివాస్‌ను కార్యాలయంలోనికి వెళ్లేందుకు అనుమతించారు.