భూమా అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి సవాల్
X
తెలుగు దేశం పార్టీ నాయకురాలు భూమా అఖిల ప్రియా రెడ్డి తనపై చేసిన ఆరోపణలను అదే పార్టీకి చెందిన ఏవీ సుబ్బారెడ్డి తిప్పికొట్టారు. చున్నీ లాగారంటూ చేసిన ఆరోపణలను సుబ్బారెడ్డి ఖండించారు. ‘‘నిన్ను నేను భుజాలపై ఎత్తుకొని పెంచాను. అలాంటి నేను చున్ని లాగాను అనడం దారుణం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి పబ్లిక్ మీటింగ్‌లలో కూడా ఏవీ సుబ్బారెడ్డి, తాను వేర్వేరు కాదని ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అలాంటిది... చున్నీ లాగి అవమానించినందుకే.. తన కార్యకర్తలు కొట్టారని, తాను కొట్టలేదని చెప్పారని.. ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు.
లోకేష్ యువగళం పాదయాత్రకు స్వాగతం పలికే విషయంలో.. అఖిలప్రియ ప్రత్యేకంగా టెంట్ వేసి, గ్రూపు రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఇక, లోకేష్ పాదయాత్ర సమయంలో తాను తప్పు చేసి ఉంటే పోలీసులకు ఆధారాలు ఇవ్వాలని ఏవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. అప్పుడు పోలీసులే అరెస్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. తనకు అవమానం జరగడంతో పాటు దెబ్బలు తగిలితే.. అఖిల ప్రెస్ మీట్ పెట్టి తనను తిట్టడమేంటని ప్రశ్నించారు. అఖిల ప్రియ అనుచరులంతా కర్నూలు, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లని ఆరోపించారు. వాళ్లను తన వెంట ఎందుకు తిప్పుకుంటుందో పోలీసులనే అడుగుతానని పేర్కొన్నారు.
అఖిల ప్రియ సొంతంగా మీటింగ్ పెడితే జనాలు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్రలో తాము పాల్గొనకూడదని కుట్ర పన్నారని తెలిపారు. ముందు వెళ్తున్న తనను వెనుక నుంచి తోసివేశారని.. దీంతో కళ్లు కనపడడం లేదా అని తాను ప్రశ్నించినందుకు చున్నీ లాగి అవమానించారని అఖిల ప్రియ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. యువగళం పాదయాత్రకు స్వాగతం పలికే విషయంలో.. అఖిలప్రియ ప్రత్యేకంగా టెంట్ వేసి, గ్రూపు రాజకీయాలు చేశారని ఆరోపించారు.
ఇలాంటి అవమానాలు ఎన్ని చేసినా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ వీడబోనని తేల్చి చెప్పారు. ఒకవేళ టీడీపీ తనని దూరం పెడితే.. అప్పుడు కూడా ఇంట్లో కూర్చొని బాధ పడతానే తప్ప, పార్టీ మాత్రం మారబోనని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే నంద్యాలలో లేదా అళ్లగడ్డలో పోటీ చేస్తానని వెల్లడించారు.