సీఎం జగన్ నుంచి వైఎస్ షర్మిలకు ప్రాణహాని - బుద్ధా వెంకన్న
X
వైఎస్ షర్మిలకు అన్న జగన్మోహన్ రెడ్డి, అవినాష్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని టీడీపీ ఆరోపించింది. వివేకా హత్య కేసులో సాక్ష్యం చెప్పిన షర్మిలకు కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న కోరారు. వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవన్నీ వాస్తవాలన్న ఆయన.. వైఎస్ వివేకా హత్య వల్ల ఆ కుటుంబం ఎంత నష్టపోయిందో.. రాష్ట్రం కూడా అంతే నష్టపోయిందని చెప్పారు. వైఎస్ వివేకా కేసులో సీబీఐ షర్మిలను 259వ సాక్షిగా చేర్చింది. ఈ క్రమంలో బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న వివేకా హత్య కేసులో జగన్ సూత్రధారి.. అవినాశ్ పాత్రధారి అని ఆరోపించారు. వివేకా హత్య విషయమై ఇంకా లోతైన దర్యాప్తు జరగాలని అన్నారు. జగన్ తో పాటు ఆయన వెనుక ఎవరున్నారో కూడా తేలాలని చెప్పారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వొద్దని జగన్ అనుకున్నారని, అయితే ఇవ్వాల్సిందేనని వివేకా పట్టుబట్టారని అందుకే ఆయనను హత్య చేశారని వెంకన్న ఆరోపించారు.
వివేకా హత్య గురించి తెలిసిన వెంటనే జగన్ పులివెందులకు ఎందుకు వెళ్లలేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. పులివెందుల వెళ్లాక కూడా జగన్ నేరుగా వివేకా మృతదేహం వద్దకు వెళ్లకుండా ఇంటికి ఎందుకెళ్లారని నిలదీశారు. హత్య విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం 5 గంటలకు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవన్నీ వాస్తవాలన్న ఆయన.. సాక్ష్యం చెప్పిన షర్మిలకు ప్రాణహాని ఉందని అన్నారు. వివేకా కుమార్తె సునీతా రెడ్డిని ఉక్కు మహిళగా అభివర్ణించిన ఆయన ఓ సైకో సీఎంపై పోరాడటం మామూలు విషయం కాదన్నారు.