జగన్‌కు లోకేశ్ సవాల్.. నాకు ఎదురుగా వచ్చి మాట్లాడితే...
X
ఎన్నికల కాలం కాబట్టి జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీపై బురద జల్లుతూ, తమ నేతలను జైల్లో పెట్టిస్తున్నాడని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దొంగతనం చేసినవాడు తన చుట్టుపక్కల ఉన్న అందర్నీ దొంగా దొంగా అంటున్నట్టు ఉందన్నారు. లోకేశ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో తాము అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఇంతవరకూ నిరూపించలేకపోయిందని అన్నారు. జగన్ అవినీతి సొమ్ము జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సండూర్ పవర్ ప్లాంట్లకు చేరినట్లు పక్కాగా తేలిపోయిందని, అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాత్రం చంద్రబాబుకు డబ్బు చేరిందని నిర్ధారణ కాలేదని, కనుక్కోవాల్సి ఉందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
‘‘మేం అవినీతి చేసి ఉంటే సాక్ష్యాధారాలతో నిరూపించాలి. జగన్ నాతో ముఖాముఖ చర్చకు వచ్చే నేను అతని అవినీతిని డాక్యుమెంట్లతో నిరూపిస్తా. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ దేశానికి కొత్తేమీ కాదు. గుజరాత్ సహా ఏడు రాష్ట్రాల్లో అమలైంది. మేమే తక్కువ ధరకు కోట్ చేసి శిక్షణ అందించాం. కంపెనీలు అందించిన సాఫ్ట్‌వేర్, ఇతర పరికరాల విలువను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వ్యాల్యూ చేసింది. అన్ని పత్రాలూ ఉన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేబినెట్ అనుమతి లేదని చెప్పడం పచ్చి అబద్ధం. 2015 ఫిబ్రవరి 16న కేబినెన్ దానికి ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 2.13 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించాం. వారిలో 80 వేల మంది ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగార్హతగల మానవ వనరులున్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలో 2016లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానాన్ని ఆక్రమించింది. 2017లో రెండో స్థానంలో, 2018, 2019ల్లోనూ తొలి స్థానంలో నిలిచింది. ఇప్పుడు జగన్ అదంతా తన ఘనత అని చెప్పుకుంటున్నాడు’’ అని లోకేశ్ ఆక్షేపించారు. ఈ ప్రాజెక్టుపై కేసు నమోదై రెండేళ్లయినా చంద్రబాబుకు ఇంతవరకూ నోటీసు ఎందుకు కాలేదని, ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి కనుకే బురద జల్లుతున్నారని విమర్శించారు. ఇదంతా, ప్రపంచమంతటికీ తెలిసిన ఓ అవినీతిపరుడు చేస్తున్న కుట్ర అన్నారు.