కక్షతోనే అరెస్ట్.. జగన్ సర్కారుపై బాలయ్య ఫైర్..
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుపై ఆయన బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని అన్నారు.
16 నెలలు జైలులో ఉన్న జగన్, టీడీపీ అధినేత చంద్రబాబును కనీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే జీవితలక్ష్యమన్నట్లు కక్ష సాధిస్తున్నారని బాలయ్య ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ చంద్రబాబు నాయుడిని ఎలా అరెస్ట్ చేశారని బాలయ్య ప్రశ్నించారు. అదో పెద్ద కుంభకోణమన్న ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభిప్రాయపడ్డారు. ఇదంతా వైసీపీ సర్కారు రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర అని విమర్శించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో19.12.2021న ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని గుర్తు చేసిన బాలకృష్ణ.. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు చార్జ్‌షీట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. డిజైన్ టెక్ కంపెనీ అకౌంట్స్ ఫ్రీజ్ చేసినప్పుడు కోర్టు ఆ డబ్బు నేరానికి సంబంధించినది కాదని చివాట్లు పెట్టి మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీన్ని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా? అని అడిగారు. కోర్టు మొట్టికాయలు వేసినా మళ్లీ తప్పల మీద తప్పుల చేసి ఎందుకు న్యాయస్థానం తిట్లు తింటారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి.. కోర్టుల చేత చివాట్లు తినడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్న బాలయ్య.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.