Galla Jayadev : టీడీపీ ఎంపీ సంచలన నిర్ణయం.. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై
X
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. తనన రెండు సార్లు గెలిపించినందుకు గుంటూరు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పారు. 10ఏళ్లుగా ప్రజాసేవ చేశానన్న గల్లా.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ అవకాశం వస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వివరించారు.
గల్లా కుటుంబానికి 50ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర ఉందని జయదేవ్ తెలిపారు. తన తాత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ‘‘మా అమ్మ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రజలకు సేవ చేసేందుకు నేను కూడా అమెరికా నుంచి తిరిగివచ్చా. చాలా మంది వివిధ రంగాల్లో ఉంటూ రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. నేను కూడా బిజినెస్మ్యాన్గా, రాజకీయ నాయకుడిగా రాణించాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడాను. అమరావతి మాస్టర్ ప్లాన్ విభాగంలోనూ పనిచేశా. నా వ్యాపారాలను మరింత విస్తరించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాను’’ అని జయదేవ్ తెలిపారు.