Btech Ravi : బీటెక్ రవి కిడ్నాప్... పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత
X
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మంగళవారం కడప నుంచి పులివెందుల వస్తున్న ఆయన తమ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. పోలీసులే రవిని తీసుకెళ్లారని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. రవి భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే రవి గురించి తమకేమీ తెలియదని, వివరాలు తెలుసుకుంటామని పోలీసులు చెప్పి పంపారు. పోలీసులు రవిని ఏదో కేసులో అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించనున్నారు.
రవి కనిపించకపోడంతో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ శ్రేణుల నుంచి, పోలీసుల నుంచి తమ ముప్పు ఉందని టీడీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. రవికి ప్రాణహాని కలిగించే అవకాశముందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ రవి (మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) పులివెందులో టీడీపీకి పెద్ద అండ. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందను ఓడించిన రవికి కడప జిల్లాలో టీడీపీ ఉనికి చాటడడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు.