రుషికొండ నిర్మాణాలపై టీడీపీ - వైసీపీ ట్విట్టర్ వార్
X
విశాఖ రుషికొండపై వైసీపీ ప్రభుత్వం చేపడతున్న నిర్మాణాలు వివాదాలకు దారితీస్తున్నాయి. కొండపై అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ జనసేన, టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల పవన్ రుషికొండ నిర్మాణాలను సందర్శించి...వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వివాదం నేపథ్యంలో తాజాగా వైసీపీ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. రుషికొండపై సీఎం జగన్ సచివాలయ భవనాలను నిర్మిస్తున్నారని వెల్లడించింది. ఈ ట్వీట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది.
మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం... సచివాలయాన్ని అమరావతిలోనే కొనసాగిస్తామని ప్రకటించింది. కార్యనిర్వాహక రాజధాని మాత్రమే విశాఖ అని, శాసనసభ అమరావతిలోనే కొనసాగుతోందని తెలిపింది. ఇప్పుడు సడెన్ గా సచివాలయం కూడా విశాఖలో నిర్మాణాలు చేపడతున్నట్లు ప్రకటించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో కాసేపటికే ఆ ట్వీట్‌ను వైసీపీ తన ఖాతాను తొలగించింది.
‘మా అధికారిక ట్విటర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు’’ అని వైసీపీ మరోసారి వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది.
ట్వీట్‌ను డిలీట్ చేయడంపై టీడీపీ కౌంటరిచ్చింది. "ఈ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావ్ 'బుజ్జి కన్నా'? భయం వేసిందా ? సిగ్గేసిందా ? తాడేపల్లి నుంచి కోటింగ్ పడిందా? అంటూ ఎద్దేవా చేస్తూ మరో ట్వీట్ చేసింది. దీనిపై కౌంటర్ ఇచ్చిన వైసీపీ... ‘‘వాస్తవానికి మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి, అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము ధైర్యం మాకు ఉంది, కానీ మీలాగా, మీ నాయకుడు చంద్రబాబు లాగా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టే తప్పుడు కార్యక్రమాలు మేమెప్పుడు చేయలేదు, చేయబోం కూడా. ఇదీ మా నాయకుడు జగన్ మాకు నేర్పిన లక్షణం, ఇదీ మా విశ్వసనీయత’’ అని ట్వీట్ చేసింది.