తెలంగాణపై బొత్స విషం.. గురివింద నీతులు చెప్పొద్దంటున్న జనం..
X
తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. ఆయన చేసిన కామెంట్లపై రాజకీయంగానే కాక జనం నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అవినీతి, అక్రమాలు, కుంభకోణాల్లో కూరుకుపోయిన ఏపీ మంత్రి తెలంగాణపై విషం కక్కుతూ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తీవ్రంగా తప్పుబడుతోంది. బొత్స వైఖరి చూస్తే గురివింద తన నలుపు ఎరుగదంట అన్న సామెత గుర్తొస్తోందని పలువురు అంటున్నారు
నోరు పారేసుకున్న బొత్స
ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాల విడుదల మీడియాతో మాట్లాడిన బొత్స తెలంగాణపై విషం చిమ్మారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదని, అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలే అంటూ నోరు పారేసుకున్నారు. అంతేకాదు ఉపాధ్యాయ బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని విమర్శించారు. ఇలా తెలంగాణ విద్యా వ్యవస్థపై నోరు పారేసుకున్న బొత్స సత్యనారాయణ పలువురు మండిపడుతున్నారు.
మంత్రుల కౌంటర్
బొత్స వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని కూడా లేని రాష్ట్రానికి చెందిన మంత్రి అలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. గతంలో ఏపీపీఎస్సీలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలంటూ బొత్సకు సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ సైతం బొత్సపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారంటూ ఫైర్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులను పట్టుకుని జైలుకు పంపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్న విషయాన్ని గంగుల గుర్తు చేశారు. ఏపీలో టీచర్ల బదిలీలకు రూ.లక్షకు పైగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆరోపించారు. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఏపీపీఎస్సీ సభ్యులే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారంటూ గంగుల మంత్రి బొత్సకు చురకలంటించారు.
వోక్స్ వ్యాగన్ స్కాం
తెలంగాణపై విషం చిమ్మిన బొత్స సత్యనారాయణ వైఖరిని తెలంగాణవాసులు కడిగిపారేస్తున్నారు. అవినీతి, అక్రమాలు, కుంభకోణాల్లో కూరుకుపోయిన ఆయనకు తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతికత లేదని మండిపడుతున్నారు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్, వోక్స వ్యాగన్ కుంభకోణం, వైజాగ్ ల్యాండ్ స్కాంల గురించి ప్రస్తావిస్తున్నారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు రూ. 11 కోట్ల చెల్లించిన కుంభకోణంలో బొత్స సత్యనారాయణపై ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో కార్ల ఫ్యాక్టరీ స్థాపనకు వోక్స్ వ్యాగన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం వశిష్ట వాహన్‌కు రూ. 11 కోట్లు చెల్లించింది. అయితే వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించడంతో బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో నాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. 2005లో వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీబీఐ 3 వేల పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ బొత్సను ప్రశ్నించింది.
మద్యం కుంభకోణంలో..
2012లో ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం సిండికేటు వ్యవహారంలో అప్పటి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై ఆరోపణలు వచ్చాయి. మద్యం టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ కుంభకోణంలో రూ. 17కోట్లు చేతులు మారినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ కు చెందిన గిరి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఈ కుంభకోణానికి సూత్రధారని పిటిషన్ లో పేర్కొన్నారు. బొత్స తదితరుల అక్రమాలను ఏసీబీ గుర్తించినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, దీనిపై విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు. మరోవైపు
సిండికేట్లు ఏర్పాటు చేయడం, మద్యం ధరలు పెంచడంలో కమిషన్లు వసూలు చేయడం, మద్యం షాపులనుంచి లంచాలు వసూలు చేయడం తదితర ఆరోపణలపై అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ విచారణ జరిపించింది. ఎసీబీ నివేదికలో బొత్స పాత్ర ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ హై కమాండ్ జోక్యంతో ఈ వ్యవహారం పక్కదారి పట్టిందన్న విమర్శలు వచ్చాయి.
వైజాగ్ ల్యాండ్ స్కాం
ఇదిలా ఉంటే విశాఖ భూ కుంభకోణంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పాత్ర ఉందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. విశాఖ మధురవాడలో జరిగిన రూ.1500కోట్ల స్కాం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆయన టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తోంది. మధురవాడలో స్థలం మార్కెట్ వాల్యూ తక్కువగా చూపించి ఆ తప్పును తెలుగుదేశంపై నెడుతున్నారని ఆ పార్టీ మండిపడుతోంది. రూ.1500కోట్లు పలికే 97.29 ఎకరాల భూమి విలువను కేవలం రూ.187 కోట్లుగా లెక్కగట్టారని ఆరోపిస్తోంది. దీని వెనుక బొత్స హస్తం ఉందని అంటోంది.