చంద్రబాబు రిమాండ్ వేళ..ఏపీలో దుమారం రేపుతున్న ఫ్లెక్సీ
X
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించన వేళ..ఏపీలో ఓ ఫ్లెక్సీ తీవ్ర దుమారం రేపుతోంది. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో థాంక్యూ జగన్...నా ఆత్మకు శాంతి చేకూర్చావు అంటూ వెలసిన ఈ ఫ్లెక్సీ తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ పేరుతో రాశినట్లుగా ఉన్న ఈ ప్లెక్సీని చూసి తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. రాజకీయంగానూ ఈ ఫ్లెక్సీ ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడునుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. బాబు జైలుకు వెళ్లడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. బాబు రిమాండ్‌ను టీడీపీ, జనసేన వామపక్షాలు వ్యతిరేకిస్తుంటే, అధికార పార్టీ వైసీపీ స్వాగతిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్‌కు వ్యతిరేకంగా ఏపీలో ప్రస్తుతం బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెలసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫ్లెక్సీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉన్నాయి. " నా చివరి దశలో అనేక అవమానాలకు గురి చేసిన , అత్యంత క్షోభ పెట్టి, నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను మరణించాక నా మరణాన్ని వాడుకున్నాడు, నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా కుటిల రాజకీయాలకు వాడుకున్నాడు, ఆఖరికి నా మనమడు తారకరత్నను కూడా వీడి కొడుకు లోకేశ్ నీచ రాజకీయానికి వాడుకున్నాడు. ఈ నీచుడికి బుద్ది చెప్పి నా ఆత్మకు శాంతి చేకూర్చావు. సెప్టెంబర్ 10న బాబు జైలుకు వెళ్లిన నేపథ్యంలో తెలుగు ప్రజలంతా ఈ రోజును ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి"" అని ఫ్లెక్సీలో రాసి ఉంది.
స్థానికంగా ఈ ఫ్లెక్సీ తీవ్ర దుమారం రేపుతోంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా దీనిని చూస్తున్నారు. మరోవైపు తెలుగు తమ్ముళ్లు ఈ ఫ్లెక్సీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక దుర్మార్గపు చర్య అంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.