Home > ఆంధ్రప్రదేశ్ > మహిళా భక్తులు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌‌తో వీడియో తీసి..

మహిళా భక్తులు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌‌తో వీడియో తీసి..

మహిళా భక్తులు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌‌తో వీడియో తీసి..
X

పవిత్రమైన దేవాలయంలోనూ తన పాడుబుద్ధిని బయటపెట్టాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఆలయ దర్శనం కోసం వచ్చిన మహిళా భక్తులు.. బాత్రూమ్‌లలో స్నానం చేస్తుండగా.. సెల్‌ఫోన్ తో షూట్ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. అది చూసిన మహిళలు కేకలు వేయడంతో.. వెంటనే పరారయ్యాడు. ఏపీలోని వైఎస్ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రామయ్య దర్శనం కోసం రెండు కుటుంబాలు ఇక్కడకు వచ్చాయి. ఉదయం 9.30 గంటలకు ఇద్దరు మహిళలు ఆలయ సమీపంలోని తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో వెంటిలేటరు నుంచి ఓ యువకుడు చేతిలో సెల్ ఫోన్‌తో లోపలకు తొంగిచూస్తుండగా వారు గమనించి గట్టిగా కేకలు వేశారు. దీంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

జరిగిన ఘటనపై తీవ్ర ఆందోళన చెందుతూ ఆ మహిళలు భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సదరు సిబ్బంది పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా యువకుడి ఆచూకీ లభించలేదు. మరో విషయం ఏంటంటే.. ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు కూడా కొన్నిరోజులుగా సక్రమంగా పనిచేయడం లేదు. ఈ విషయంపై డిప్యూటీ ఈవో నటేష్‌బాబును సంప్రదించగా మహిళల స్నానపుగదులు, వస్త్రాలు మార్చుకునే గదుల వద్ద భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు.




Updated : 4 Aug 2023 8:13 AM IST
Tags:    
Next Story
Share it
Top