గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుంది : జగన్
X
వైఎస్‌ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుంది అని సీఎం జగన్ అన్నారు. గండికోటను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నామని తెలిపారు. ఆదివారం గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం అన్నారు.
స్టార్ గ్రూపుల రాకతో గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తామన్నారు.సెవెన్ స్టార్స్ హోటల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. గండికోటలో గోల్ఫ్ కోర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఒబెరాయ్‌ని కోరినట్లు తెలిపారు. గండికోటకు మరో స్టార్ గ్రూప్‌ను కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కొప్పర్తి డిక్సన్ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయన్న జగన్... కొప్పర్తిలో పలు కంపెనీలతో సోమవారం ఎంవోయూలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలో కడప స్టీల్‌ఫ్యాక్టరీకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాబోతుందన్నారు.