సీఎం సభకు వెళ్లిన ఉపాధ్యాయురాలు మృతి
X
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సీఎం జగన్ విద్యా కానుక సభకు హాజరైన ఉపాధ్యాయురాలు వడదెబ్బకు గురై మృతిచెందింది. ఏలూరుకు చెందిన ఎం. పద్మావతి (52) అమరావతిలో నివాసం ఉంటూ లింగాపురం జడ్పీ పాఠశాలలో హిందీ టీచర్‌గా పని చేస్తున్నారు. క్రోసూరులో జరిగిన విద్యా కానుక సభకు ఆమె 50 మంది విద్యార్థులను తీసుకొని వెళ్ళారు. ఎండ భారీగా ఉండడంతో సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తర్వాత రోజు ఉదయం మంగళవారం ఉదయం పాఠశాలలో జగనన్న కిట్లు పంపిణీ కార్యక్రమం ఉండడంతో ఒంట్లో బాగాలేకపోయినా వెళ్లిపోయారు. ఈ క్రమంలో మరోసారి ఆమె అస్వస్థతకు గురై సొమ్ముసిళ్లి పడిపోయారు. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పద్మావతి అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.