Ap Politics : ఓటర్ల జాబితాపై అనుమానాలు.. వినూత్న రీతిలో నిరసన
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల సంఘం తొలి దఫా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఏపీలో ఐదు కోట్ల మందికి పైగా ఓటర్లు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారంగా 4 కోట్ల మందికి పైగానే ఓటర్లు ఉన్నారు. దీనిపై టీడీపీ, జనసేన పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంపై తిరుపతి జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నేతలు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రగిరిలో దొంగ ఓట్లపై తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సుధా యాదవ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు జరిగాయన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయన్నారు. ఈ మధ్య విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో కూడా చనిపోయిన వారికి ఓట్లు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.
అధికార యంత్రాంగం తీరును తప్పుపడుతూ సుధా యాదవ్ నిరసన తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి ఓట్లను ఇంకా తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్మశానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి నిరసన తెలిపారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు వెళ్లి వాల్ క్లాక్, కుక్కర్లను ఆ సమాధులపై ఉంచి తనకే ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. బోగస్ ఓట్లను తొలగించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటర్ల జాబితాలోని అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.