విహారయాత్రలో విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు
X
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఏలూరు శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు మారేడుమిల్లి సమీపంలో ఉన్న గుడిసె పర్యాటక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించిన విద్యార్థులు ఉదయ్ కిరణ్, హేమంత్, హర్షవర్థన్ లుగా గుర్తించారు. పదిమంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది.
అయితే, ప్రమాద సమయంలో ఆ కారులో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్ తో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మారేడుమిల్లిని చూసేందుకు నిన్న ఉదయం బయల్దేరిన విద్యార్థులు.. సాయంత్రం చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 11 గంటల టైంలో కోరుకొండ దాటుతుండగా ప్రమాదం జరిగింది. కల్వర్టు పైకెక్కే క్రమంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ లోతుగా ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటికి తీశారు. విద్యార్థులంతా 20 ఏళ్ల లోపు ఉన్నవారేనని పోలీసులు చెప్పారు. కేవలం మారేడుమిల్లిని చూసి వచ్చేందుకు వచ్చారు.. ఈ ప్రమాదం నుంచి ప్రణీత్, వంశీ, హేమంత్ సురక్షితంగా బయటపడ్డారు అని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోకరి కోసం గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.