తిరుమలలో పుష్కరిణి మూసివేత.. కారణమేంటంటే..?
X
తిరుమలలో శ్రీవారి ఆలయం వద్దనున్న పుష్కరిణిని నెల రోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని చెప్పారు.
సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. సెప్టెంబర్ లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అంతకు ముందే పుష్కరిణిలో నీటిని తొలగించి మరమ్మతులను పూర్తి చేయనున్నారు.
మరోవైపు తిరుమలలో అక్టోబర్ నెలకు సంబంధించి గదుల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఇప్పటికే అక్టోబర్ నెలకు సంబంధించి సేవలు.. దర్శనం ఆన్ లైన్ కోటా టికెట్లను రిలీజ్ చేసింది. వేసవిలో తగ్గించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను నెలకు మరో 4 వేల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు ఈ పెంచిన కోటా టికెట్లను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబర్ నెలకు సంబంధించి గదుల కోటాను ఈ రోజు (జూలై 26) న విడుదల చేసింది. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో లాగినై టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ ఇవాళ పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది.