ALERT: భక్తులకు అలర్ట్.. తిరుమల ఆలయం మూసివేత, ఎందుకంటే..
X
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఈ నెలలో ఒక రోజున శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు టీటీడీ అధికారులు. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయం అక్టోబర్ 28 రాత్రి మూసివేయబడుతుందని, అక్టోబర్ 29న తిరిగి తెరవబడుతుందని ప్రకటనలో తెలిపారు.పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28 సాయంత్రం 7.05 గంటల నుండి 29వ తేదీ వేకువజామున 3గంటల 15 నిమిషాల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతారు. వేకువజామున 3 గంటల 15 నిమిషాలకు ఆలయాన్ని తెరుస్తారు. శుద్ధి, పున్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సుప్రభాత సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆ తర్వాతే ఆలయం తలుపులు తెరుస్తారు.చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటు ఆలయం తలుపులు మూసి ఉంటాయని, అక్టోబర్ 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. కొండపై ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులు దాదాపు 5 కిలోమీటర్ల మేర శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. అసలే వీకెండ్ కావడం, ఆపై వరుస సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. ఇక పెరటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి భక్తుల పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. దాంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. పెరటాసి నెల రద్దీ కారణంగా ఈ రోజున SSD టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టీటీడీ కోరింది.