Home > ఆంధ్రప్రదేశ్ > Ap budget-2024 : నేడే ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌..ఆ లెక్కలు తేల్చనున్న బుగ్గన

Ap budget-2024 : నేడే ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌..ఆ లెక్కలు తేల్చనున్న బుగ్గన

Ap budget-2024 : నేడే ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌..ఆ లెక్కలు తేల్చనున్న బుగ్గన
X

(Ap budget-2024)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు చట్టసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.2.86 లక్షల కోట్లను అంచనా వేశారు. అయితే ప్రస్తుత ఓటాన్ అకౌంట్ కింద 4 నెలలకు మాత్రమే రూ.96 వేల కోట్ల వరకూ బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ ఏపీ బడ్జెట్‌ను చూసినట్లైతే 2019-20లో రూ.2,27,974 కోట్లు, 2020-21లో రూ.2,24,789 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఆ తర్వాత 2021-22లో రూ.2,29,779 కోట్లు, 2022-23లో రూ.2,56,256 కోట్లు, 2023-24లో రూ.2,79,279 కోట్లు బడ్జెట్‌‌ను వైసీపీ సర్కార్ నిర్ణయించింది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరింత కీలకం కానుంది. ఎన్నికల రానున్న తరుణంలో ఏపీ ప్రజలు బడ్జెట్‌పై ఎన్నో అంచనాలతో ఉన్నారు.

ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో జగన్ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా అప్పులు చేసింది. నిన్నటితో ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులే రూ.66 వేల కోట్లకు చేరుకోవడం విశేషం. ఓ వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు వైసీపీ హామీలు, ఉచిత పథకాలు ఎక్కువవుతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం వల్ల రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఉదయం 8 గంటలకు సమావేశం కానుంది. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభలో ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


Updated : 7 Feb 2024 6:58 AM IST
Tags:    
Next Story
Share it
Top