AP Assembly Meeting : నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
X
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్ధుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ బీబీఏ సమావేశాలు జరుగుతాయి. 7వ తేదీన సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 8వ తేదీ వరుకు శాసన సభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సభానాయకుడు సీఎం జగన్, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ పట్టుబట్టాలని భావిస్తోంది.
చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ కోరే అవకాశం ఉంది. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అలాగే, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాపతీర్మానాన్ని ప్రవేశ పెడతారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు జరిగే చిట్ట చివరి సమావేశాలు కావడంతో టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు తెలిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరో వైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించుకునే అవకాశముంది.