ఒరేయ్.. రాజకీయాలకు మా అమ్మే దొరికారా.. నాగబాబు ఫైర్
X
ఏపీ రాజకీయాలు పెళ్లిళ్ల చుట్టూ, కులాల చుట్టూ తిరుగుతూ మరింత వివాదాస్పదంగా మారుతున్నాయి. తమ తల్లి గురించి వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు మండిపడ్డారు. రాజకీయాలతో సంబంధంలోని మహిళలను కూడా రచ్చకీడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తల్లి రెల్లి కులస్తురాలని, ఆ నిజాన్ని ఒప్పుకోవడం ఆయనకు ఇష్టం లేని ఓ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలపై నాగబాబు సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. కాపుగా పుట్టినందుకు గర్విస్తున్నానని, ఎవరికి కులం వారికి గొప్పని చెప్పుకొచ్చారు. ‘ఒరేయ్, పనికిమాలిన రాజకీయాలు చేయడానికి మా తల్లే దొరికారారా మీకు?’’ అని ధ్వజమెత్తారు.
‘‘స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. ముఖ్యత్రి స్థాయి వ్యక్తులనే వాడు, వీడు అంటున్నారు. పెళ్లాలు, పెళ్లిళ్లు, తల్లులు, పిల్లలను రచ్చకీడుస్తూ ఒకరి బొక్కల్ని మరొకరు బయటపెట్టుకుంటున్నారు. మా తమ్ముడు(పవన్) గత ఎన్నికల్లో రెల్లి కులాన్ని దత్తత తీసుకుంటాన్నాడు. ఆ కులాన్ని మనం తక్కువ చేశాం. మా అమ్మ నిజంగానే రెల్లి కులంలో పుట్టి ఉంటే మేం గర్వపడేవాళ్లం. రెల్లి కులస్తులు కుళ్లును, చెత్తను, నీచాన్ని తొలగించి మనకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తారు. అలాంటి వాళ్లకు మనం చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్లు బిడ్డ మలమూత్రాలను శుభ్రం చేసే తల్లిలాంటి వాళ్లు. మా కుటుంబంలో జాతిమత భేదాలు లేవు. ఎస్సీలను తక్కువ చేసి మాట్లాడం. అందర్నీ సమానంగా చూడాలనే సంస్కారాన్ని మా నాన్న మాకు నేర్పాడు’’ అని అన్నారు.